UPDATED 5th NOVEMBER 2017 SUNDAY 8:00 PM
రాజమహేంద్రవరం: న్యాయవాదుల అపరిష్కృత డిమాండ్స్, 2014 ఎన్నికల మానిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుపరచాలని రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అడ్‌హాక్ కమిటీ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. స్థానిక రాజమండ్రి బార్ అసోసియేషన్ లో జిల్లా బార్ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ న్యాయవాదులకు హెల్త్ కార్డులు మంజూరుచేయాలని, డెత్ బెనిఫిట్ రూ.10 లక్షలకు పెంచాలని, న్యాయవాదుల సంక్షేమానికి రూ.150 కోట్ల నిధులు కేటాయించాలన్నారు. న్యాయవాదులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. ఐదు వేలు స్టైఫండ్ ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్ కౌన్సిల్ పంపిన తీర్మానాలకు అనుగుణంగా ఏపీ అడ్వొకేట్లు వెల్ఫేర్ ఫండ్ చట్టాన్ని తక్షణమే సవరించాలని, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల మాదిరిగా ఏపీ న్యాయవాదుల సంక్షేమనిధికి మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, ప్రభుత్వం వెల్ఫేర్ స్టాంపుల రూపేణా చెల్లించవలసిన బకాయిలను తక్షణమే న్యాయవాదుల సంక్షేమ నిధికి జమచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయశాఖ, ఇతర మంత్రులకు ఈ మెయిళ్లు, ఫ్యాక్స్‌లు, మెసేజెస్ ద్వారా వినతిపత్రాలు పంపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన విధంగా మన రాష్ట్రంలోనూ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి నిధులు మంజూరు చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తదుపరి కార్యాచరణ నిమిత్తం ఈనెల 10వ తేదీన అమలాపురం బార్ అసోసియేషన్‌లో జిల్లా బార్ అసోసియేషన్ల కార్యవర్గాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బచ్చు రాజేష్, జి.వెంకటేశ్వరావు, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మట్టపల్లి మురళీకృష్ణ, పెయ్యల సత్యనారాయణ, బార్ కౌన్సిల్ అడ్‌హాక్ కమిటీ సభ్యుడు బి.గోకుల్‌కృష్ణ, జిల్లాలోని న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.







