UPDATED 6th FEBRUARY 2018 TUESDAY 8:30 PM
సామర్లకోట; మండల సమాఖ్యలు ఖర్చులు నిర్వహణలో పొదుపు పాటించాలని డి.ఆర్.డి.ఎ పిడి ఎస్. మల్లిబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని టిటిడిసి ఆవరణలో జిల్లా సమాఖ్య రెండవరోజు సమావేశం మంగళవారం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నాగదుర్గ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పిడి మల్లిబాబు మాట్లాడుతూ సమాఖ్యలలో స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల రాష్ట్రంలో 12 శాతానికి స్త్రీనిధి ప్రగతి మారిందన్నారు. రికవరీలు వేగవంతం చేసేందుకు రౌతులపూడి మండలంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన బృందంతోనే మిగిలిన మండలాలలో కూడా డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఏరియా కో ఆర్డినేటర్లు, ఎపిఎంలు ఏడాది కాలంగా చేసిన విశేష కృషిలో భాగంగా ఐదుగురిని ఎంపిక చేసి వారికి పిడి మల్లిబాబు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ ఎపిడి కె. శ్రీనివాసకుమార్, జిల్లా సమాఖ్య కార్యదర్శి బి. భవాని, కోశాధికారి ఎం. లలిత, మండల సమాఖ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







