అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దీక్షకు దిగారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లే మార్గంమధ్యలో పవన్ శ్రమదానం చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం వద్ద పారపట్టి కంకరను గుంతల్లో వేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ పవన్ ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లి విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా దీక్షలో కూర్చొన్నారు.







