TS News : గతేడాదితో పోలిస్తే తెలంగాణలో నేరాలు పెరిగాయి : డీజీపీ

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021‌: కొవిడ్ సమయంలో రాష్ట్ర పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేశారని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రశంసించారు. ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు సేవలందించారని కొనియాడారు. వార్షిక నేర నివేదిక-2021ని విడుదల చేసిన డీజీపీ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులు పడ్డ కష్టానికి ప్రజల నుంచి మంచి పేరు లభించింది. నేరాలు నియంత్రించడంలో, నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులు మంచి ఫలితాలు సాధించారు. మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉండాలని ప్రభుత్వం సూచనలను సమర్థంగా అమలు చేశాం. 98 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. 133 మంది లొంగిపోయారు. వారి నుంచి ఆయుధాలు, నగదు కూడా స్వాదీనం చేసుకున్నాం. ప్రజల సహాయ సహకారాలతో గత ఏడేళ్లుగా ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేకుండా చూస్తున్నాం. ఒక్క నిర్మల్‌ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయి’ ఇక గత ఏడాదితో పోలిస్తే.. రాష్ట్రంలో 4.6 శాతం నేరాలు పెరిగాయి. నేరగాళ్లకు శిక్ష పడిన కేసులు 50.3 శాతంగా ఉన్నాయి. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడింది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గరయ్యాం. డయల్ 100కి 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. నగరంలో 5 నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 800 పీఎస్‌లలో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పేద, ధనిక తేడా లేకుండా పోలీసు శాఖ పనిచేస్తోంది. షీ టీమ్స్ 5145 పిర్యాదులు స్వీకరించి బాధితులకు భరోసా కల్పించాయి. హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా పిర్యాదులు వచ్చాయి. తరచూ నేరాలకు పాల్పడుతున్న 664 మంది నేరగాళ్లపై పీడీ చట్టం నమోదు చేశాం. రాష్ట్రంలో 8.5 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలోనే ఎక్కువగా ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా కీలక ఆధారాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది 8828 సైబర్ నేరాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో 6690 మంది చనిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.879 కోట్లు జరిమానా విధించాం’ అని డీజీపీ వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us