UPDATED 20th JULY 2017 SATURDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మూడు రోజులపాటు వెబ్ డిజైనింగ్ పై నిర్వహించిన వర్క్ షాప్ గురువారంతో ముగిసింది. ఈ వర్క్ షాప్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు కె. బాల శ్రీధర్ విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు రూపొందించిన వారికే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకోసమే విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టేలా ఇటువంటి వర్క్ షాప్ లను నిర్వహించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందచేశారు. అలాగే సాఫ్ట్ వేర్ నిపుణుడు బాల శ్రీధర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, హెచ్ వో డి లు ప్రొఫెసర్ ఎ. వానతి, ఎం. రాజబాబు, సుధారాణి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.







