UPDATED 17TH MAY 2017 WEDNESDAY 11:45 AM
పెద్దాపురం: పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ఏపిహెచ్ఎంఐడిసి ద్వారా రూ.40 లక్షలు విడుదలయ్యాయని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలోఅభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ బంగారుబాబు మాట్లాడుతూ ఈ నిధులతో ఆసుపత్రి పై అంతస్థు నిర్మిస్తామన్నారు. అలాగే ఆసుపత్రిలో రోగులకు అందించే భోజనం నాణ్యతాలోపంగా ఉంటోందని ఈ విషయం పై రోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. ఇటీవల డి ఎం అండ్ హెచ్ వో ఆసుపత్రిని సందర్శించినప్పుడు రోగులకు అందించే భోజనాన్ని రుచి చూసి కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని, అయినప్పటికీ కాంట్రాక్టర్ తీరు మార్చుకోకుండా వ్యవహరించడం పట్ల అతనికి నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం రోగులకు అందించకపోతే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలు విషయాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మురళీకృష్ణ, వర్మ, రవికాంత్, అభివృద్ధి కమిటీ సభ్యులు రావులపర్తి విజయ్, విరోధుల రాజేశ్వరరావు, బిక్కిన సాయినాథ్, హెడ్ నర్స్ ఎస్తేర్ రాణి తదితరులు పాల్గొన్నారు.







