UPDATED 26th JUNE 2017 MONDAY 4:00 AM
భువనేశ్వర్/పూరీ: ప్రఖ్యాత పూరీ జగనాథుడి రథయాత్ర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తండోపతండాలుగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య రథయాత్ర ముందుకుసాగింది. ఇసకేస్తే రాలనంత జనం రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒడిశాలోని పూరీలో ప్రతియేటా నిర్వహించే ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ యాత్ర తొమ్మిది రోజులపాటు కొనసాగుతుంది. జగన్నాథుడు, బలభద్ర, దేవి సుభద్ర ముగ్గురు మూడు రథాల్లో కొలువుదీరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ అంటూ భక్తులు రథాన్ని ముందుకు లాగుతుండగా స్వామివారు రథం మీది నుంచి ఆశీస్సులు అందజేశారు. రథయాత్ర ప్రారంభానికి ముందు నిర్వహించాల్సిన సంప్రదాయ కార్యక్రమాలను పూర్తి చేసిన ఆలయ అధికారులు అనంతరం ముగ్గురు దేవుళ్లను చెక్కతో చేసిన రథాలపై కొలువుదీర్చారు. రథయాత్రలో అపూర్వ ఘట్టం చెరాపొహరా. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం జగన్నాథ సంస్కృతికి అద్దం పడుతుంది. ఆదివారం మూడు రథాలపై పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ మరోసారి పురుషోత్తముని సన్నిధిలో ప్రధాన సేవకుని హోదాలో బంగారు చీపురుతో డ్చి, కస్తూరి కల్లాపి చల్లి, మంగళహారతి పట్టి పూజలు నిర్వహించారు. 45 అడుగుల ఎత్తు, 16 భారీ చక్రాలతో తయారు చేసిన రథంపై జగన్నాథుడు కొలువుదీరగా.. 44 అడుగుల ఎత్తు, 14 చక్రాల రథంలో బలభద్ర, 43 అడుగుల ఎత్తు, 12 చక్రాల రథంలో సుభద్ర కొలుదీరారు. తొమ్మిది రోజులపాటు కొనసాగే రథయాత్రలో భాగంగా రథాలు గుండిచ దేవాలయానికి చేరుకొని తిరిగి పూరీ జగన్నాథుడి దేవాలయానికి వస్తాయి. రథయాత్రను పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో రథాలను తాకుట, దేవుళ్లను ముట్టుకునుటపై ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 127 ప్లాటూన్ల పోలీసులను మోహరింపజేశామని, పలు ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశామని డీజీపీ కేబీ సింగ్ చెప్పారు. ఉగ్రదాడుల నేపథ్యంలో రథయాత్ర ప్రదేశంలోనే కాకుండా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని, గస్తీని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాం. ఒకవేళ ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా తొక్కిసలాట జరుగకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం అని డీజీపీ పేర్కొన్నారు. ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్(ఓఎస్‌ఏఎఫ్), యాంటీ టెర్రరిస్టు స్కాడ్(ఏటీఎస్), రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) దళాలను కూడా రంగంలోకి దింపామని చెప్పారు. ఇంకోవైపు రథయాత్రను పురస్కరించుకొని ఆలయ దేవస్థానం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పార్కింగ్, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు చేసింది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.







