* అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీనివాసాచారి
UPDATED 9th NOVEMBER 2018 FRIDAY 8:00 PM
పెద్దాపురం: న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సహాయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని 7వ అదనపు జిల్లా జడ్జి ఎం. శ్రీనివాసాచారి పేర్కొన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ అధ్యక్షతన జాతీయ న్యాయసేవా దినోత్సవం సందర్భంగా స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయం దృష్టిలో అందరు సమానులేనని, అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి భారత రాజ్యాంగం న్యాయ సేవల అధికారిక చట్టం ఏర్పాటు చేసిందన్నారు. దీని ద్వారా సమాజంలోని షెడ్యుల్డు కులాలు,తెగలు, స్త్రీలు, పిల్లలు, అంగవైకల్యం, కార్మికులు, తదితరులకు ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం ఈ చట్టం కల్పించిందన్నారు. ప్రజలకు అందే న్యాయ ఉచిత సహాయ సేవలపై పారా లీగల్ వలంటీర్లు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యం చేసి, ఈసేవలను వినియోగించేలా ప్రచారం కల్పించాలన్నారు. గతంలో పల్లెల్లో రచ్చబండ ఉండేదని, ఏదైనా సమస్య వస్తే గ్రామ పెద్దలు పరిష్కరించే వారని దానికి అనుగుణంగానే లోక్ ఆదాలత్‌లు ఏర్పాడ్డాయని, వీటిని వినియోగించడం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించబడి, సమన్యాయం జరుగుతుందన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, అనవసరపు వివాదాల జోలికి పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్.వి.ఎస్. మూర్తి (బాలు), పారా లీగల్ వాలంటీర్లు భళ్లమూడి హరికృష్ణ, నూతలపాటి అప్పలకొండ, ఎం. భాస్కరరావు, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.







