UPDATED 23rd JUNE 2026 8:00 AM
బొలెరో బోల్తా పడి ముగ్గురు యువకులు దుర్మరణం!
రంగంపేట, రెడ్ బీ న్యూస్, జూన్ 23 : తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం... సామర్లకోటకు చెందిన కొందరు యువకులు బొలెరో వాహనంలో ప్రయాణిస్తుండగా, రంగంపేట మండలం వడిశలేరు గ్రామ సమీపంలోకి రాగానే వాహనం యొక్క టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపైనే పల్టీలు కొట్టింది. అర్ధరాత్రి సమయం కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సామర్లకోటకు చెందిన మురమళ్ళ రాజు (28), తాతపూడి రాజేష్ (20), మసకపల్లి బాలు (20) అనే ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
అలాగే ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద శబ్దం విన్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో సామర్లకోటలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.







