Updated 2nd May 2017 Tuesday 12:30 PM
పెద్దాపురం : టిడిపికి మెట్టలో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ టిడిపి నాయకుడు ఆచంట రాజన్న(రాజబాబు) పార్టీ కి గుడ్ బై చెప్పారు. తీవ్ర అసంతృప్తి కారణంగానే తాను పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన స్వగ్రామం పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అనుచరులతో మంగళవారం మాట్లాడారు. అలాగే తన రాజీనామా లేఖను మీడియా ప్రతినిధులకు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నాటి నుoచి ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ ఎంతో సహనంతో మండల స్థాయిలో పార్టీ అభివృద్ధికి, అలాగే తన స్వగ్రామంలో పార్టీ బలోపేతానికి తనతో పాటు తన అనుచరగణం అవిశ్రాంతంగా శ్రమించామని, అయితే తనకు పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ లభించడం లేదని, పైగా తనకు, తన అనుచరగణానికి సరైన గుర్తింపు లభించడంలేదని తీవ్ర నిరాశా, నిస్పృహలను వెళ్లగక్కారు. రాజకీయపరంగా ఎన్నో కేసులను సైతం ఎదుర్కొన్నామని అయితే వాటన్నింటిని ఎంతో ఓపికతో భరించామని, అయినా పార్టీలో తనకు నేటికీ సరైన గుర్తింపు లభించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. గ్రామానికి సర్పంచి గా, నీటి సంఘం అధ్యక్షుడిగా, జన్మభూమి కమిటీ అధ్యక్షుడిగా, గ్రామ టిడిపి అధ్యక్షుడిగా ఇలా పలు పదవుల్లో పనిచేశానని, అయితే గడిచిన స్థానిక సంస్థల ఎన్నికలలో తనకు మండల టిడిపి అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తానని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారని, అయితే ఇచ్చిన హామీలను మరచి తనకు తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లో పనిచేస్తున్న కార్యకర్తలు పైకి చెప్పుకోలేక తీవ్ర నిరాశతో అసంతృప్తి తో రగిలిపోతున్నారని, పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని, పార్టీ ప్రారంభం నుంచి పార్టీనే నమ్ముకున్న తమలాంటి వారికి అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. గుర్తింపు లేని చోట పనిచేయడం కష్టంగా భావించి తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు రాజన్న పేర్కొన్నారు. అలాగే టిడిపి గ్రామ కమిటీ మొత్తం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఏ పార్టీలో చేరేది తన భవిష్యత్ కార్యాచరణను తన అనుచరులతో మాట్లాడి అనంతరం తెలియచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మనబోయిన వెంకటేశ్వరరావు, పూసపాటి చక్రవర్తి, ఆచంట శేషారావు, మణికంఠ, కంచుమర్తి వెంకట్రావు, జొన్నాడ దుర్గారావు, బట్రెడ్డి సూరిబాబు, గుమ్మిడి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.







