Updated 21st August 2023 Monday 6:20 pm
Bandi Sanjay – TTD : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏపీ పాలిటిక్స్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఛాన్స్ చిక్కితే చాలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు బండి సంజయ్.
విజయవాడలో ”ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించారు బండి సంజయ్. ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తుల్లో అడుగడుగునా ఆందోళన సృష్టిస్తూ తిరుమలకు రాకుండా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అని ఆయన టీటీడీపై విరుచుకుపడ్డారు. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డిపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ? ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజం కాదా? నేను నాస్తికుడని అని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెలియదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నారట. ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో?
నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారు. పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణం. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు.
రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మన మధ్య మనస్పర్ధలు లేవు. అందరం బాగుండాలని అనుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయ్. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.
ఒక మతానికే కొమ్ము కాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు? జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టి సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.







