UPDATED 12th DECEMBER 2018 WEDNESDAY 8:00 PM
రాజానగరం: గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న 23వ జిల్లాస్థాయి అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ అధ్యక్షతన బహుమతి ప్రదానోత్సవ సభ జరిగింది. ఈ సభలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సిఎం. సాయికాంత్‌వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరూ, లక్ష్య సాధనే విజయమని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఆటలను అలవర్చుకోవాలని, క్రీడలతోనే శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ టివి. రాజశేఖర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక ధారుడ్యం సొంతమవుతుదని అన్నారు. ఐపిఎస్‌జిఎం నోడల్ ఫిజికల్ డైరెక్టర్ విఠల్ మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు గైట్ యాజమాన్యం చక్కటి సహాయ సహకారాలు అందించిందన్నారు. గుడ్లవల్లేరులో ఈనెల 17వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర క్రీడా పోటీలకు విన్నర్స్ టీమ్, అథ్లెటిక్స్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించినవారు రిపోర్ట్ చేయాలన్నారు. గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశికిరణ్ వర్మ మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, అయితే నేటి ఓటమి రేపటి గెలుపునకు పునాదిగా భావించాలన్నారు. క్రీడా స్పూర్తితో ఆడిన క్రీడాకారులందరూ అభినందనీయులని అన్నారు. గైట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ పిజి. రామానుజం మాట్లాడుతూ గైట్ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం ఇది రెండవసారని, కళాశాల యాజమాన్యం క్రీడలతో పాటు విద్యాభివృద్ధికి సమన ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ఐపిఎస్‌జిఎం పరిశీలకులు రాంజీ రాజారావు, విశ్రాంత డిఎస్‌పి నామగిరి బాబ్జి, గైట్ ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ సిఎం హెన్రీ, పి. శివకుమార్, డి. సూర్యనారాయణ, అప్పారావు దొర, తదితరులు పాల్గొన్నారు.







