రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: ‘ఆర్ఆర్‌ఆర్’ (RRR) చిత్రాన్ని ప్రారంభించినపుడు ఏ టైటిల్ పెట్టాలో తెలియలేదని, తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ అనుకున్నామని దర్శకుడు రాజమౌళి (Rajamouli) అన్నారు. ఇటీవల ఓ హిందీ షోలో పాల్గొన్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’ విశేషాల్ని పంచుకున్నారు. టైటిల్ గురించి వివరిస్తూ.. ‘‘ఈ సినిమాను ప్రారంభించిన సమయంలో ఏ టైటిల్ పెట్టాలో మాకు అర్థంకాలేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్టును ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని పిలవాలనుకున్నాం. అలా #RRR హ్యాష్‌ట్యాగ్‌తోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చాం. ఈ పేరుకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్’నే సినిమా పేరుగా ఖరారు చేశాం’’ అని వివరించారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయంపైనా ఆయన స్పందించారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టంచేశారు. ‘‘భావోద్వేగం, విప్లవం, భారతీయ సంస్కృతి.. వీటి సమ్మేళమనమే ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ కారణంగా ఈ ప్రాజెక్టు లార్జర్ దేన్ లైఫ్‌గా అవతరించింది. నా భార్య రమ (కాస్ట్యూమ్ డిజైనర్) మినహా ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. పాన్ ఇండియా అంటే ఇదేనేమో’’ అని అన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదల కానుంది.







