నారాయణగూడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ‘దేవుడి వైభవాన్ని ప్రపంచానికి చూపించాలనే కోరిక కలిగిన పాలకులు మనకున్నారు. ఇప్పటికే రాముడి ఆలయం సిద్ధమవుతోంది. కాశీ విశ్వేశ్వరుడి కారిడార్ వైభవంగా జరిగింది. మిగితావి కూడా దిగ్విజయంగా జరుగుతాయ’ని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి మన వంతు బాధ్యతగా వారసత్వసంపద, భగవద్గీత, ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా భావితరాలకు సక్రమంగా అందించడానికి కృషి చేయాలని భగవత్ బంధువులకు పిలుపునిచ్చారు. విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘లక్ష యువగళ గీతార్చన’ స్ఫూర్తిమంతంగా సాగింది. వందలాది యువత తరలివచ్చారు. భగవద్గీత ఫౌండేషన్ స్థాపకులు గంగాధరశాస్త్రి 40 శ్లోకాలను వారిచేత పారాయణం చేయించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చినజీయర్ స్వామి ప్రసంగిస్తూ.. విజ్ఞాన శాస్త్రానికి అందని ఎన్నో రహస్యాలు భగవతాది గ్రంథాలు, ఉపనిషత్తులో చక్కగా వివరించారన్నారు. రామాయణం, భగవద్గీతలు పుక్కిటి పురాణాలు, కట్టుకథలు కావన్నారు. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. మనదైన వారసత్వం అన్యాక్రాంతం కాకూడదన్నారు. మన పెద్దలు అందించిన గ్రంథాలను నలుగురికి అందించే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ కార్యక్రమంగా కాకుండా మన స్వరూపాన్ని, ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రతిజ్ఞలా కావాలన్నారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి మహారాజ్ ప్రసంగిస్తూ.. భగవద్గీతను జాతీయ గ్రంథంగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో ఉడుపీ పీఠం పేజావర్‌స్వామి, అఖిల భారత విశ్వహిందు పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే మాట్లాడారు. మైహోమ్ రామేశ్వరరావు, వీహెచ్‌పీ జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బ్రండారి రమేష్, ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.







