Updated 24th April 2017 Monday 6:30 PM
పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లాను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడిఎఫ్) జిల్లాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ మహోత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్ముడు ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను గ్రామాల్లో అమలు చేసి గ్రామ పంచాయతీల పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను చేపట్టేందుకు సర్పంచులు కృషి ఎంతో అవసరం అన్నారు. అనంతరం ఓడిఎఫ్ గా ఎంపిక కాబడిన సర్పంచులను మంత్రి సన్మానించి మెమెంటోలను అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెo వెంకట శ్రీనివాసరావు (కోటి), జెడ్పిటిసిలు గుమ్మళ్ల విజయలక్ష్మి, సుందరపల్లి శివనాగరాజు, ఎంపిడివోలు పి. వసంత మాధవి, బి.నాగేశ్వరరావు, ఎఎంసి వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, సామర్లకోట ఎంపిపి మార్త, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.







