UPDATED 20th FEBRUARY 2018 TUESDAY 8:00 PM
సామర్లకోట: పట్టణ పరిధిలోని పన్నులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మార్చి నెలాఖరు నాటికి నూరుశాతం పన్నులు వసూలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఆర్డీ నాగరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పారిశుద్యం, పన్నులు, అభివృద్ధి పనులు, పురసేవ, తదితర అంశాలపై సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీజియన్ పరిధిలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు పన్నులు వసూళ్ళలో ముందంజలో ఉండగా, కృష్ణా జిల్లా వెనుకంజలో ఉందని అన్నారు. రైల్వే ఆస్తులపై పన్నులు వసూలుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పట్టణ పరిధిలో మున్సిపల్ దుకాణాల అద్దెల బకాయిలపై అపరాధ రుసుము తగ్గించాలని దుకాణదారులు ఆర్డీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్డీ మున్సిపల్ కమీషనర్, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ తో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు, మేనేజర్ కె.డబ్యు. జయకర్, తదితరులు పాల్గొన్నారు.







