Updated 23rd April 2023 Sunday 6:10 am
Simhachalam : ఏడాది మొత్తం చందనం పూతలో వుండే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆదివారం (వైశాఖ శుక్లపక్ష తదియ నాడు) భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. చందనోత్సవంగా పేర్కొనే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వరాహ-నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడి నిజరూపాన్ని కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, రుత్విగ్వరణము, పంచకలశా వాహనం నిర్వహించారు. తరువాత ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఏడాది పొడవునా స్వామి వారిపై పూతగా వుండే చందనాన్ని వెండి బొరిగెలతో తొలగించి ప్రభాత ఆరాధన చేశారు. అనంతరం తిరిగి స్వామివారి హృదయంపై, శిరస్సుపై అప్పటికే సిద్ధం చేసిన చందనం ముద్దలను ఉంచారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజుకు, వారి కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున స్వామి వారికి దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. కాగా సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్నారు.







