UPDATED 11th OCTOBER 2022 TUESDAY 02:00 PM
RBK: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి ఇంటి యజమాని పరిమి వీరభద్రరావు మంగళవారం తాళం వేశారు. గత తొమ్మిది నెలల కాలం నుంచి అద్దె చెల్లించడం లేదని, అధికారులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదని ఇంటి యజమాని వాపోయాడు. తనకు అద్దె చెల్లించమని అధికారులను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నానని.. అయినా ఉపయోగం లేకపోవడంతో రైతు భరోసా కేంద్రానికి తాళం వేశానని ఇంటి యజమాని విలేకరులకు తెలిపారు.
వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన పరిమి వీరభద్రరావుకు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. నెలకు రూ.4 వేలు వంతున చెల్లించేందుకు యజమానితో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇంటి యజమానికి సుమారు తొమ్మిది నెలలుగా అద్దె చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో తన అద్దె డబ్బులు విషయంపై పదే పదే అధికారులను అడుగుతున్నా వారు పట్టించుకోలేదు. దీంతో ఇంటి యజమానికి విసుగుచెంది మంగళవారం ఉదయం రైతు భరోసా కేంద్రానికి తాళం వేశాడు. ఇదిలా ఉండగా తనకు నెలవారీ వచ్చే పింఛన్ సొమ్ముల్లో నుంచి ఇంటి పన్ను చెల్లించాలని చెప్పి గ్రామ వాలంటీర్ డబ్బు తగ్గించి తన నెలవారీ పింఛన్ ఇచ్చారని, పన్నులు తీసుకోవడం తెలుసుకానీ తనకు ఇంటి అద్దె చెల్లించాలని తెలియదా అని ఇంటి యజమాని ప్రశ్నించాడు. తన ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేశాడు.
ఈవిషయంపై మండల వ్యవసాయ అధికారి కొమ్మోజు సంజయ్ కుమార్ ను వివరణ కోరగా రైతు భరోసా కేంద్రానికి అద్దె చెల్లించాల్సిన మాట వాస్తవమే అని, అయితే ఈ సంవత్సరం జనవరి నుంచి మే నెల వరకూ అద్దెకు సంబంధించిన డబ్బును యజమానికి చెల్లించేందుకు బిల్లు పెట్టామని, ప్రస్తుతం ట్రెజరీ వద్ద పెండింగ్ లో ఉందని, త్వరలోనే అద్దె బకాయి మొత్తం యజమానికి చెల్లిస్తామని చెప్పారు.







