UPDATED 21st FEBRUARY 2022 MONDAY 01:30 PM
Bheemla Nayak: ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ సంస్థ. మంత్రి మృతికి గౌరవ సూచకంగా భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్. వాస్తవానికి భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు (21 ఫిబ్రవరి 2022) హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. వాయిదా వేశారు
ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో రానా దగ్గుబాటి మరో హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని సాగర్ చంద్ర దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికేట్ దక్కించుకుంది. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి, ముఖ్య అతిధిగా కేటీఆర్‌ని కూడా ఆహ్వానించారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే, విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సినిమా వేడుకను ఆపుతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం. విద్యాధికుడైన ఆయన ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించారు. శ్రీ గౌతమ్ రెడ్డి గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి శ్రీ రాజమోహన్ రెడ్డి గారికి, కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.







