● రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్
● పెద్దాపురంలో ఆర్డీవో, తహశీల్దార్, సబ్ - ట్రెజరీ కార్యాలయాలను ప్రారంభించిన మంత్రులు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు పరిపాలనకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో సుమారు రూ.4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్డీవో, తహశీల్దార్, సబ్ - ట్రెజరీ కార్యాలయ నూతన భవనాలను ఆయన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, శాసన సభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు, జక్కంపూడి రాజా, జిల్లా కలక్టర్ సి. హరికిరణ్, స్థానిక ప్రజా ప్రతినిథులతో కలిసి కార్యాలయ భవనాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనిలో భాగంగా 31 లక్షల మంది లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహహక్కు అమలుపర్చడం, సమగ్ర భూ సర్వే నిర్వహించడం వంటి పథకాలు ఉన్నాయని అన్నారు. 2023 నాటికి సమగ్ర భూ సర్వే పనులు పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాలలో వివాదాస్పద భూ తగాదాలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. పేదల్లో ఆర్థిక స్థిరత్వం పెంపొందించేందుకు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీ, కులం, మతం బేధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట వేసే విధంగా ఆయా వర్గాల కోసం 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి అనేక డైరెక్టర్ల పోస్టులను నియమించి సముచిత న్యాయం కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వినూత్నమైన ఆలోచనలతో పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి. వెంకటరమణ, తహశీల్దార్ బూసి శ్రీదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కనకాల మహాలక్ష్మి సుబ్రహ్మణ్యం, ఎంపీపీ పెంకే సత్యవతి, వైస్ ఎంపీపీ కంటే ప్రభావతి వీర్రాఘవరావు, జడ్పీటీసీ సభ్యుడు గవరసాన సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.







