UPDATED 14 FEBRUARY 2022 MONDAY 08:00 AM
★ పగటిపూట రోడ్డుపై స్వేచ్ఛగా నడిచే పరిస్థితి లేదు
★ తెలుగు మహిళ నారీ సంకల్పదీక్షలో రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
★ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం
★ 2024 తర్వాత వడ్డీతో కలిపి ప్రతీకారం ఉంటుంది: గోరంట్ల
★ దీక్షకు సంఘీభావం తెలిపిన టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
రాజమహేంద్రవరం : మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అరాచక పాలన సాగిస్తున్నాడని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళలకు రక్షణ కరువై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం తెలుగు మహిళలు చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఆదివారం రాజమహేద్రవరం గాదాలమ్మనగర్ బీవీఆర్ కన్వెర్షన్ సెంటర్‌లో నారీ సంకల్ప దీక్ష అనిత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పర్యవేక్షణలో నిర్వహించారు.
దీనికి ముఖ్యఅతిథులుగా మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కేఎస్ జవహర్, గొల్లపల్లి సూర్యారావు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, వంతల రాజేశ్వరి, జ్యోతుల నెహ్రూ, అయితాబత్తుల ఆనందరావు, వనమాడి కొండబాబు, బండారు సత్యానందరావు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా, జడ్‌పీ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు చాలా వేదనతో ఉన్నారన్నారు. పాదయాత్రలో మహిళల నుదురుపై చెయ్యిపెట్టి, ముద్దుపెట్టిన జగన్ ఒక అన్నగా, పెద్దగా తమకు అండగా నిలుస్తాడని అనుకున్నారని అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచేశాడన్నారు. ఇంత దిక్కుమాలిన, దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ పాలనలో మహిళలు పగటిపూట కూడా నిర్భయంగా రోడ్డుపై నడవలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1500మంది మహిళలపై దాడులు జరిగాయని చెప్పారు. దిశచట్టం కేవలం బిల్డప్ మాత్రమేనని ఇప్పుడు ప్రజలకు అర్థమైందన్నారు.
సీతానగరంలో బాలిక గ్యాంగ్ రేప్, బొమ్మూరులో బాలిక రేప్ ఘటనలతో అత్యాచారాలు, వాటిని నియంత్రించలేని ప్రభుత్వ తీరుతో ఆడబిడ్డలు భయాందోళలనకు గురై బయటకు రావడం లేదన్నారు. ఇదంతా తాడేపల్లిలో కూర్చొన్న సీఎం జగన్‌కు ఏం తెలుస్తుందని విమర్శించారు. తొలుత మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ మహిళ కంట కన్నీరు పెట్టిన చోట సిరులు ఉండవని, రాష్ట్రంలో జగన్ పాలనతీరుతో అటువంటి పరిస్థితులు దాపురించాయని చెప్పారు.







