Updated 7th December 2022 Wednesday 5:25 pm
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది. దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ వాహన ట్రయల్ రన్ ను పవన్ కల్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు చేశారు పవన్. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ పవన్ చర్చించారు.
ఈ వాహనానికి ‘వారాహి’ అమ్మవారి పేరుపెట్టారు. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారి పేరు (పురాణాల ప్రకారం)ను పవన్ తన ఎన్నికల ప్రచార వాహనానికి పెట్టారు.
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ తెలంగాణలోని కొండగట్టు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఆయన అక్కడి నుంచే ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అనుష్టు నారసింహ యాత్ర పేరుతో ఏపీతో పాటు తెలంగాణలోనూ పవన్ కల్యాణ్ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది.







