అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కొత్త ఏడాది నుంచి పింఛన్లు పెంచడం సంతోషించదగిన విషయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. పింఛన్ల పెంపుపై ప్రతిపక్షాలు వెటకారంగా మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. వారి హయాంలో కేవలం 31 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే గతంలో పింఛన్లు ఇచ్చేవారని, ఇప్పుడు అర్హులు అందరికీ ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదరికాన్ని కొలమానంగా తీసుకొని పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం వైసీపీ అని మంత్రి వెల్లడించారు. ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తుందని పెద్దిరెడ్డి వెల్లడించారు.
ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు:
మేకతోటి సుచరిత ‘‘ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లగల వ్యక్తి మన ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చాక పింఛన్ పెంపుపై సీఎం జగన్ మొట్టమొదటి సంతకం చేశారు. ఇప్పుడు అది రూ.2,500కు పెరిగింది. సంక్షేమ పథకాల కోసం అర్హులు గతంలో ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల గడప వద్దకు చేరుతున్నాయి. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’’ అని సుచరిత పేర్కొన్నారు.







