విజయనగరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: జిల్లా ఒమిక్రాన్ కేసు నమోదుకావడంపై డీఎంహెచ్‌వో డా. రమణకుమారి స్పందించారు. ఈనెల 5న ఐర్లాండ్ నుంచి సదరు వ్యక్తి జిల్లాకు వచ్చారన్నారు. విదేశాల నుంచి వచ్చాక విశాఖలో తన అత్తవారింటికి వెళ్లాడని.. బాధితుడికి వైద్యసిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. దీంతో స్వాబ్ నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఈనెల 6న హైదరాబాద్ సీసీఎంబీకి పంపారని.. ఒమిక్రాన్‌గా అక్కడ నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో వివరించారు. బాధితుడికి శనివారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో నెగటివ్ వచ్చిందని రమణకుమారి చెప్పారు. బాధితుడిని కలిసిన 40 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని.. వారికి నెగటివ్ వచ్చిందని తెలిపారు. బాధితుడి స్వగ్రామంలోనూ కొవిడ్ పరీక్షలు చేస్తున్నామన్నారు. అతడి ఇంటి పరిసరాల్లో సుమారు వంద మందికి టెస్టులు చేస్తున్నామని.. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఎంహెచ్‌వో అన్నారు.







