UPDATED 28th JULY 2017 FRIDAY 10:00 PM
తూర్పుగోదావరి జిల్లాలో గల కిర్లంపూడి ఓ చిన్నమండల కేంద్రం. అక్కడ ఉన్నది ఒక చిన్నపోలీసు స్టేషన్. కానీ ఆ ఊళ్లో ఇప్పుడు వేలాది మంది పోలీసులు తిష్టవేసి ఉన్నారు. అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జరిగిన ఏర్పాటు ఇది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేయదలచుకున్నపాదయాత్రను ప్రభుత్వం ఆయన ఇంటి ప్రహరీ గేటు వద్దే అడ్డుకుంది. ఆయన కూడా ప్రభుత్వానికి కొత్త సవాళ్లు విసిరారు. కిర్లంపూడిలో పోలీసులు ఎంతకాలంపాటు నియంత్రిస్తారో చూస్తానని పోలీసు బలగాలు వైదొలగిన వెంటనే తన పాదయాత్ర జరగుతుందని, కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడానికి పాదయాత్ర చేసి తీరుతానని ఆయన హెచ్చరించారు. అయితే కిర్లంపూడి నుంచి పోలీసు బలగాలు తరలిపోయేది ఎప్పుడు? ఇప్పుడు వేల సంఖ్యలో అదనపు బలగాలను జిల్లా అంతటా మోహరించారు. ఎటు చూసినా.. సీఆర్పీఎఫ్ దళాలు - రోడ్ల మీద పోలీసు అవుట్ పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. వీరంత ఇతర ప్రాంతాల నిమిత్తం ప్రస్తుతం పాదయాత్రను అడ్డుకునే విధుల్లో భాగంగా ఇక్కడకు వచ్చిన వారు. వీరంతా తిరిగి తమ సొంత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లాలి. ఇటువైపేమో.. పోలీసులు తప్పుకోగానే.. తాను పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇప్పట్లో ఈ పోలీసులకు విముక్తి కల్పించదేమో. మంజునాధ కమిషన్ నివేదిక ఇచ్చి కాపులను బీసీల్లో కలిపే నిర్ణయం తేలిన తర్వాత గానీ ముద్రగడ పాదయాత్ర చేయకుండా ఊరుకునే అవకాశం లేదు. అప్పటికి గానీ.. పోలీసు బలగాల్ని తొలగించడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలదేమో అనేది వీరి భయం. అదే నిజమైతే గనుక.. తొందరగా నివేదిక ఇచ్చేయండి సార్ అని విన్నవించుకునే లాగా ఈ పోలీసులందరిలోనూ.. ‘నమో మంజునాధా’ అనే మంత్రమే ప్రతిధ్వనిస్తూ ఉండడంలో ఆశ్చర్యం ఏముంది!







