UPDATED 7th MARCH 2018 WEDNESDAY 8:00
సామర్లకోట: ప్రధాన రహదారుల్లో వాహనాలను ఇష్టానుసారం పార్కింగ్ చేస్తే సహించేది లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లిఖార్జున హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో వివిధ రాష్ట్రాల నుంచి లారీల్లో వస్తున్న మద్యం లోడ్ వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేసి ఉండటాన్ని ఆయన గమనించి పై విధంగా స్పందించారు. వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని వాహనాలు రహదార్లకు అడ్డుగా లేకుండా చూడాలని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ డిపో అధికారులను జాయింట్ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. ఈ మేరకు డిపోలో వాహనాల పార్కింగ్ కు స్థలం లేదని ఐ.ఎం..ఎల్. డిపో అధికారులు తెలిపారు. దాంతో డిపో సమీపంలో ఉన్న ఈటీసీ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని, ఇక నుంచి రోడ్లపై వాహనాలు ఉండటానికి వీలు లేదని హెచ్చరించారు. అలాగే ఈటీసీలో ఎ.ఎస్.వో సర్వేయర్ లేకపోవడంతో ఎక్కడని జెసి ప్రశ్నించారు. ఎ.ఎస్.వో శిక్షణలో ఉన్నారని, సర్వేయర్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నట్లు తహసీల్దార్ ఎల్. శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, వీఆర్వోలు పాల్గొన్నారు.







