మల్కాపురం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: రక్షణ మంత్రిత్వశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) కీలకపాత్ర పోషిస్తోందని సంస్థ సీఎండీ హేమంత్ ఖాత్రీ పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా షిప్‌యార్డ్ కాలనీలో సంస్థకు సంబంధించిన ఉత్పత్తుల మేళాను సోమవారం ఆయన ప్రారంభించాను. అనంతరం ఖాత్రీ విలేకర్లతో మాట్లాడుతూ నౌక నిర్మాణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డు అగ్రభాగాన ఉందన్నారు. సంస్థ సాధించిన విజయాలపై ఈ నెల 13 నుంచి 19వ తేది వరకు మేళా(ఎగ్జిబిషన్)ను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో 75 ప్రదేశాలలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా దిల్లీలో ప్రారంభించారన్నారు. ఇది విద్యార్థులను, నగర ప్రజలను ఉత్తేజ పరుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 80 ఏళ్లలో 200 నౌకలను తయారు చేసి దేశానికి అందించిన ఘనత హెచ్‌ఎస్‌ఎల్‌కు దక్కిందని విశాఖ వాసులు గర్వించదగ్గ విషయమన్నారు. ‘ఐఎన్‌ఎస్ సింధువీర్’ ‘ఆత్మ నిర్భర్ భారత్’ కింద తయారు చేసిన నౌకలు, జలాంతర్గాములను త్వరలో జాతికి అంకితం చేయనున్నామన్నారు. నగరంలో ఉన్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత, స్థానికుల సందర్శనార్ధం ఈ నెల 19వరకు మేళా అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.







