UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 04:30 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మార్చి 18 నాటికే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. మార్చి 15-17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వర్తిస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల పరిశీలన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటారు. కాగా, ఈ కమిటీకి విజ్ఞప్తులు చేసేందుకు ప్రజలకు 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ విజ్ఞప్తులను కలెక్టర్లు సేకరిస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ (drp.ap.gov.in)కు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుండాలి.







