హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు ఒకింత అసంతృప్తితో ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అగ్ర కథానాయకుడు చిరంజీవితో సహా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్ ధరల తగ్గింపు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్న దృష్ట్యా, ఈ వ్యవహారానికి తెర దించాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చిరంజీవి స్వయంగా కలవనున్నారని సమాచారం. ముందుగా మంత్రి పేర్నినానిని కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రధానంగా టికెట్ ధరల వ్యవహారాన్ని ఆయనతో చర్చించనున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సీఎం జగన్‌ను కలిసి పరిస్థితి వివరించనున్నారట. టికెట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని, సినీ పరిశ్రమకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో పాటు, పలువురు సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేసీఆర్ టికెట్ రేట్లు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. తాజా ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించడంతో తెలంగాణ వ్యాప్తంగా థియేటర్‌లలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లభించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల చిరంజీవి, విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ నటులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వంతోనే చర్చించి ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని చిరంజీవి యోచిస్తున్నారట. మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల నటుడు నాని బహిరంగంగా వ్యాఖ్యలు చేయగా, అవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల వేదికగా నానికి పలువురు మద్దతు తెలిపారు. నటుడు సిద్ధార్థ్ సైతం తనదైన శైలిలో చురకలు అంటిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.







