UPDATED 21st JUNE 2017 WEDNESDAY 1:00 PM
పెద్దాపురం: పెద్దాపురం మండల పరిధిలోని ఆయకట్టు చెరువైన రాఘవమ్మ చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను బుధవారం ఆర్.బి. కొత్తూరు గ్రామానికి చెందిన రైతులు యెండ్రు సత్తిబాబు, యెండ్రు రామారావు, గోలి సూర్యనారాయణ, గోలి రామకృష్ణ, సబ్బినీడి అబ్బు, బాబ్జి, పుట్టా భద్రరావు, ఉండవల్లి నారాయణరావు, మన్యం రామ్మోహనరావు లతో పాటు పలువురు రైతులు లారీలను అడ్డుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే దాని పేరుతో అక్రమమార్గంలో మట్టిని తరలించి సొమ్ము చేసుకునేందుకు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. చెరువు అభివృద్ధి పేరుతో రహస్యంగా లారీలతో మట్టిని తరలిస్తున్నారని, లారీ ఒక్కింటికి రూ.1000 వంతున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. పైగా ఆయకట్టు రైతులకు సమాచారం చెప్పకుండా ఈ తరలింపు వ్యవహారం చేస్తున్నట్లు ఆరోపించారు. దీంతో బుధవారం మట్టి తరలిస్తున్న లారీలను రైతులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సుమారు 174 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును నీరు-చెట్టు పథకంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తక్కువ ధరకే టెండర్ దక్కించుకుని ఈ తవ్వకాలు సాగిస్తున్నట్లు సమాచారం.







