హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీఎం జగన్ ప్రతి కార్యక్రమాన్ని ఉద్యమ దీక్షతో చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. విశాఖలో ల్యాండ్‌పూలింగ్ చేస్తే స్టే తీసుకొచ్చి పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయిస్తే అక్రమాలు జరిగాయని కోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చారని టీడీపి నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. పేదలపై టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ‘‘పేదలు సొంత ఇల్లు అని కళలు కనడం తప్పా? జగన్ పథకాలను ఏనాడైనా చంద్రబాబు మెచ్చుకున్నారా? రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ఆయన చూస్తున్నారు’’ అని బొత్స విమర్శించారు.







