UPDATED 21 JANUARY 2022 FRIDAY 09:00 PM
గుడివాడ (రెడ్ బీ న్యూస్) : కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం, ఉద్రిక్త పరిస్థితులపై డీఐజీ మోహన్ రావు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గుడివాడలో ఉద్రిక్త వాతావరణం సృష్టించడం వల్లే టీడీపీ నేతలను అరెస్టు చేసినట్టు చెప్పారు. “నిజనిర్ధరణ కమిటీ నుంచి ఆరుగురు టీడీపీ నేతలే వస్తామని చెప్పి వందలాది మంది వచ్చారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందా అనేదాన్ని కూడా పరిశీలిస్తున్నాం. గృహనిర్బంధం, అరెస్టు చేయాలని టీడీపీ నేతలు ఎందుకు కోరారు. ఎక్కువ మంది వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడి ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతోనే వచ్చినట్టు భావిస్తున్నాం. రాజకీయాల కోసం శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని కోరుతున్నాం. గుడివాడలో కావాలని మేం ఎవరినీ అడ్డుకోలేదు. శాంతిభద్రతల్లో భాగంగానే కొందరిని నియంత్రించాం. రెచ్చగొట్టేలా మాట్లాడటం, కేకలు వేయడం తప్పు. ఏం జరిగింది, ఎవరు రెచ్చగొట్టారనేది దర్యాప్తు చేస్తున్నాం. గుడివాడ ఘటనపై ఎస్పీ నేతృత్వంలో వేసిన కమిటీ విచారణ జరుపుతోంది” అని డీఐజీ మోహన్ రావు తెలిపారు.







