UPDATED 8th OCTOBER 2017 SUNDAY 9:00 PM
సామర్లకోట : రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూడవ విడత రుణ మాఫీకి రంగం సిద్దమైంది. ఈ నెల తొమ్మిది నుంచి రైతుల ఖాతాల్లో అందుకు సంబంధించిన నిధులను జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే నిధులను విడుదల చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం తెలిపారు. మూడవ విడత రుణ మాఫీ కింద పెద్దాపురం నియోజకవర్గంలోని 15,582 మంది రైతులను అర్హులుగా గుర్తించారని, వీరికి సంబంధించి రూ.10.37 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని ఆయన తెలియజేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో మొదటి, రెండు విడతల్లో 41,918 మంది రైతులకు సంబంధించి రూ.40.87కోట్లు రుణ మాఫీ చేయడం జరిగిందని చినరాజప్ప వివరించారు. మూడవ విడత రుణ మాఫీకి సంబంధించిన పత్రాలను ఈ నెల తొమ్మిదిన సామర్లకోట టీటీడీసీ జరిగే కార్యక్రమంలో అర్హులయిన రైతులకు అందించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 2,50,570 మంది రైతులు మూడవ విడత రుణ మాఫీకి అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరికి సంబంధించి రూ175.93కోట్లు నిధులను ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందని చినరాజప్ప వెల్లడించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. హామీ ఇవ్వడమే కాదు ఆచరణలో అమలుచేస్తూ దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు టీడీపీ ఆదర్శంగా నిలుస్తోందని చినరాజప్ప పేర్కొన్నారు.







