అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో డిసెంబరు 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. దక్షిణ థాయ్‌లాండ్, పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి డిసెంబరు 2 నాటికి వాయుగుండంగా బలపడనుంది. డిసెంబరు 3న మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది. తర్వాత వాయవ్యదిశలో ప్రయాణించి.. మరింత బలపడుతూ 4వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాన్ని చేరే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.







