Updated 4th May 2017 Thursday 5:00 PM
పెద్దాపురం: అధికారుల తీరు పై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో నియోజక వర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపిడివోలు పంచాయతీ సెక్రటరీలు, విఆర్వోలతో ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ, గ్రామాల్లో మీ ఇంటికి మీ భూమి పథకం నియోజకవర్గ పరిధిలో పూర్తి చేయని విఆర్వో లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పధకాల అమలులో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని పధకాల అమలులో అవినీతి జరిగితే సహించేది లేదన్నారు. తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, నీరుచెట్టు మొదలైన కార్యక్రమాల అమలులో ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. రేషన్ షాపులు సమయ పాలన పాటించడం లేదని, తహసీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలన్నారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ కాలనీలో జి ప్లస్ 1 , 2 కింద నియోజకవర్గంలో మొదటి విడతగా 2817 పక్కా గృహాలు నిర్మాణానికి అర్హులను గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. మొదటి విడతగా పెద్దాపురానికి 1769 , సామర్లకోటకు 1048 మంజూరయ్యాయని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గృహాలను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు ( రాజబ్బాయి), ఓఎస్డీ సంపత్ కుమార్, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ చైర్మన్లు రాజా సూరిబాబు రాజు, మన్యం చంద్రరావు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.







