UPDATED 7th JULY 2018 SATURDAY 6:00 PM
పెద్దాపురం: పెద్దాపురం డివిజన్ పరిధిలో చౌకధరల దుకాణాల ద్వారా అందచేస్తున్న సరుకుల పంపిణీలో అవకతవకలుకు పాల్పడితే చర్యలు తప్పవని సివిల్ సప్లై అధికారులను ఆర్డీవో ఎస్.ఎస్.బి.బి. వసంతరాయుడు హెచ్చరించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని సివిల్ సప్లై అధికారులతో చౌకధరల దుకాణాల నిర్వహణపై శనివారం ఆర్డీవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల నిర్వహణకు సంబందించిన మార్గదర్శకాలను రేషన్ డీలర్లు ఖచ్చితంగా పాటించాలని, రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేయవలసిన బోర్డును అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. రేషన్ దుకాణాలను ప్రభుత్వం కేటాయించిన సమయాలలో తెరచి ఉంచాలని, సరుకు తూకాలలో తేడా వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే డీలర్లపై తప్పవని అన్నారు. బినామీలతో రేషన్ షాపులు నడుపుతున్నట్లు ఫిర్యాదులు డీలర్ షిఫ్ రద్దు చేయడం జరుగుతుందని, బయోమెట్రిక్ సమస్యలు ఉత్పన్నమైతే సంబంధిత విఆర్వోలతో సంప్రదించి పేదలకు తక్షణమే రేషన్ సరుకులు అందేలా చూడాలన్నారు. ఎం.ఎస్.వోలు తరచూ మండలంలోని చౌక దుకాణాలను తనిఖీ చేసి తనిఖీ రిపోర్టును ఎప్పటికప్పుడు పంపించాలని, ప్రతీ కార్డుదారునకు తప్పనిసరిగా రశీదు యిచ్చేలాగ ఎం.ఎస్.వోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.వో పురుషోత్తం కుమార్, పెద్దాపురం ఎం.ఎస్.వో లక్ష్మీకుమారి, డివిజన్ పరిధిలోని ఎం.ఎస్.వోలు, తదితరులు పాల్గొన్నారు.







