★ బూస్టర్లు ఆపలేవు..
★ అంత ప్రమాదకారీ కాదు
★ ప్రముఖ వైద్య నిపుణుడు డా : ములియిల్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను 'ఆల్‌మోస్ట్ ఆస్ట్రాపబుల్ (దాదాపు అనివార్యం)గా ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ అభివర్ణించారు. ప్రతి ఒక్కరినీ ఈ వేయంట్ పలకరిస్తుందని, మనం భరించలేనంత ప్రమాదకారి మాత్రం కాదన్నారు. కొవిడ్ ఇపుడు భయపెట్టేటంత రుగ్మత కాదని, కొత్త వేరియంలో ఆసుపత్రుల్లో చేరికలు కూడా తక్కువే అన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ శాస్త్రీయ సలహాసంఘ అధ్యక్షుడైన డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఒమిక్రాస్ సోకినప్పుడు మనలో 80 శాతం మందికి పైగా ఆ విషయమే తెలియకపోవచ్చు అన్నారు. ఈ వైరస్ ప్రభావం రెండు రోజుల్లో రెట్టింపు అవుతుందని, ఓమిక్రాస్ సోకిన వ్యక్తి నుంచి చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పారు. ఈ మహమ్మారి సహజ గమనాన్ని అడ్డుకోలేమన్నారు. ప్రభుత్వపరంగా మేమెక్కడా బూస్టర్ డోసు కూడా సూచించడం లేదు. ముందు జాగ్రత్త డోసుగా వేసుకోమంటున్నాం అంతే. అదీ ఎందుకంటే.. 60 ఏళ్లు పైబడ్డవారిలో కొందరికి రెండు డోసులతో ఫలితం కనిపించడం లేదు' అన్నారు. లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షల గురించి మాట్లాడుతూ.. 'ఎక్కువ రోజులు తలుపులు మూసుకొని ఇళ్లలో కూర్చోలేం. పైగా డెల్టా తో పోల్చితే ఓమిక్రాస్ ప్రభావం చాలా తక్కువ. మన దేశంలో కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చేనాటికే 85 శాతం ప్రజలు ఈ మహమ్మారి బారినపడ్డారు. కాబట్టి, మొదటి డోసే మనకు మొదటి బూస్టర్ డోసు కింద లెక్క. ఎందుకంటే భారతీయుల్లో చాలామందికి సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది' అని డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ అన్నారు.







