Kerala: కేరళలో కలకలం రేపిన ‘రాజకీయ హత్య’ కేసులో.. ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

తిరువనంతపురం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: కేరళలోని అలప్పుళ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్.. శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దుండగులు ఆయనపై దాడిచేసి తీవ్రంగా గాయపరచగా మృతిచెందారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఇద్దరు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ‘అలప్పుళలో ఎస్‌డీపీఐ నేత కేఎస్‌ షాన్‌ హత్యకు సంబంధించి ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేశాం. ప్రణాళిక, హత్యలో వారిద్దరు పాలుపంచుకున్నారు. ఈ హత్యకు సంబంధించి మా వద్ద విలువైన ఆధారాలున్నాయ. త్వరలోనే మిగతా నిందితులను గుర్తిస్తాం’ అని కేరళ పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. శనివారం బైక్‌పై వెళ్తున్న షాన్‌ను​ కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆయనపై తీవ్రంగా దాడిచేశారు. గాయపడ్డ షాన్‌ను కొందరు కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. షాన్‌ ఘటన జరిగిన 12 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో మరో కీలక నేత హత్యకు గురయ్యారు. కేరళ భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్‌ను ఆదివారం ఉదయం కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస హత్యలతో అలప్పుళ జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జంట హత్యల దృష్ట్యా మూడు రోజుల పాటు రాష్ట్రంలో అన్ని రాజకీయ ర్యాలీలను పోలీసులు నిషేధించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us