UPDATED 15th FEBRUARY 2018 THURSDAY 7:00 PM
రాజానగరం: జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవం సహస్ర-2018 తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) కళాశాలలో గురువారం ఘనంగా ప్రారంభమైనది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జె.ఎన్.టి.యూ.కె డిజైన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎ. గోపాలకృష్ణ పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సాంకేతికాభివృద్ధికి విద్యార్థుల వినూత్న ఆలోచనలు ఎంతో అవసరమని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇన్నోవేషన్లు కావాలన్నారు. ఇన్నోవేషన్లు ఆధారంగా ఎవరైనా పరిశ్రమలు స్థాపిస్తే దానిపై విద్యార్థులకు తగు ఆర్ధికసహాయం లభిస్తుందన్నారు. ఇన్నోవేషన్లతో ముందుకు వచ్చే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా రుణాలు సమకూర్చడంతో పాటు, జె.ఎన్.టి.యూ.కె లోని ఎం.హెచ్.ఆర్.డి ప్రాజెక్ట్ ద్వారా కొంత ఆర్ధిక సహాయం పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే మంచి వేదికగా సహస్ర 2018 నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల సాంకేతిక ప్రగతికి మేలు చేకూర్చే వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రెండురోజులు పాటు జరిగే సహస్ర 2018ను సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజ్ఞాన ఆధార కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు మాట్లాడుతూ సాంకేతిక ఉత్సవాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎంతగానో తోడ్పడతాయని, వివిధ కళాశాలల నుంచి హాజరయ్యే విద్యార్థులతో విజ్ఞాన మార్పిడికి ఇవి మంచి వేదికలు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవి, డైరెక్టర్లు డాక్టర్ ఎల్.ఎస్. గుప్త, డాక్టర్ టి.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.వి.జి.కె. జగన్నాధ రాజు, డీన్ డాక్టర్ ఎం. వర ప్రసాదరావు, సహస్ర కన్వీనర్ డాక్టర్ వై. వెంకట్, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







