టిడిపి బలోపేతానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయి

UPDATED 10th JULY 2017 MONDAY 9:00 PM

తణుకు : టిడిపి బలోపేతానికి నాయకత్వ శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి డ్రైవర్స్‌ కాలనీలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల టిడిపి గ్రామ, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులకు  ఏర్పాటు చేసిన నాయకత్వ శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మంత్రులకు మాదిరిగానే కార్యకర్తలకూ శిక్షణ తరగతులు తప్పనిసరని, రాబోయే రోజుల్లో శిక్షణ తీసుకోని ప్రజా ప్రతినిధులను పదవుల నుంచి తొలగిస్తామని తెలిపారు. తాను మండల పార్టీ అధ్యక్షుడి స్థాయి నుంచి క్రమశిక్షణతో ఈ స్థాయికి ఎదిగానన్నారు. కార్యకర్తల సంక్షేమానికి మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేకనిధి ఏర్పాటు చేశారని, రాష్ట్రంలో 64 లక్షల టిడిపి  సభ్యత్వాలు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్‌ ఒకటినే కాలువలకు నీరొదిలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోయారన్నారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే పార్టీ లక్ష్యమన్నారు. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు క్రమశిక్షణతో నడుచుకోవాలన్నారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రామానుజయ మాట్లాడుతూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా కార్యకర్తలు నడుచుకొని, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పాలన అందించే పార్టీ టిడిపి అని కొనియాడారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా నూరుశాతం కార్యకర్తలు తరగతులకు హాజరుకావాలన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడారు.  ఈ సందర్భంగా శిబిరం డైరెక్టర్‌ మద్దినపూడి వెంకటరాజు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తణుకు, పెద్దాపురం కమిటీల అధ్యక్ష, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వైటీ రాజా, ముళ్లపూడి వెంకటకృష్ణారావు, బండారు సత్యనారాయణ, మున్సిపల్‌ ఛైర్మన్‌ పరిమి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us