UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో పట్టణంలో తక్షణం ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా మానవహక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ప్రధాన కార్యదర్శి అళక్కి శ్రీనివాసరావు, కుంచే నానిబాబు, జుత్తుక అప్పారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు సోమవారం వినతి పత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలో సుమారు 70 వేల మంది జనాభా ఉన్నప్పటికీ, ఇక్కడ ఆధార్ కేంద్రం లేకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. గతంలో పట్టణంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయమని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేసినప్పటికీ ఇంతవరకూ ఏర్పాటు చేయలేదన్నారు. ఆధార్ కార్డులో తప్పులు సవరణ, చిన్న పిల్లలకు ఆధార్ కార్డు కావాలన్నా పట్టణంలో ఆధార్ కేంద్రం లేకపోవడం ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తోందని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణం పట్టణంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.







