హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 22 జనవరి 2022 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 'సలార్, 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్ట్ లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ప్రభాస్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బ్రేక్ అనేది తీసుకోకుండా ఆయా సినిమా షూటింగ్స్ లో ఆయన ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు. ఓ వైపు 'రాధేశ్యామ్' రిలీజ్ కు సిద్దంగా ఉండగానే.. మరోవైపు 'ఆదిపురుష్', 'సలార్, ప్రాజక్ట్ కె' షూటింగ్స్ ప్రారంభించేశారు. దర్శకులు సైతం ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పాన్ ఇండియా కథలతో ఆయన కాంపౌండ్ లోకి అడుగు పెడుతున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ప్రభాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రభాస్ మరో మూడు సరికొత్త సినిమాలకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఫుల్ యాక్షన్ నేపద్యంలో సాగే కథతో పాన్ ఇండియా మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెండో ప్రాజెక్ట్.. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యతో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారట. ఈ మేరకు మారుతి ఓ హార్రర్ కామెడీ కథను రాసి ప్రభాస్ కు చెప్పగా ఆయన ఓకే అన్నారట. దానయ్య-ప్రభాస్-మారుతి కాంబోలో రానున్న చిత్రానికి 'రాజా డీలక్స్' పేరు ప్రచారంలో ఉంది. ఈ రెండు కాకుండా దిల్ రాజుతో మరో కొత్త ప్రాజక్ట్ పట్టాలెక్కించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రిలీజ్ కు సిద్ధమైన ' రాధేశ్యామ్'తో కలుపుకుని ప్రభాస్ చేతిలో మొత్తం ఎనిమిది ప్రాజెక్ట్ లు ఉన్నాయి.







