CM Jagan: సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలమే ఇల్లు: జగన్‌

తణుకు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తన పుట్టినరోజున దాదాపు 50లక్షల పైచిలుకు లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించడం సంతోషంగా ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సొంత ఇంటి కోసం ప్రతి నిరుపేద జీవితకాలం కృషి చేస్తారన్నారు. ఇల్లు అంటే ఇటుకలు, స్టీల్‌తో కట్టిన నిర్మాణం మాత్రమే కాదని.. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలమని చెప్పారు. గృహ హక్కు పథకం ద్వారా రాష్ట్రంలో రూ.16వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామన్నారు. నామమాత్ర చెల్లింపుతో లబ్ధిదారుల ఇంటిని వారికి సొంతం చేస్తున్నామని చెప్పారు. ప్రతి నిరుపేద ఇంటి యజమాని కావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో 52 లక్షల మందికి ఇంటిపై హక్కు ఉండటం లేదని.. ఈ కారణంగానే సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దీంతో ఆస్తి విలువ పెరుగుతుందని.. ఇంటిని అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని జగన్‌ చెప్పారు. ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి డాక్యుమెంట్లు అందజేస్తున్నామన్నారు. కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని చెప్పారు. ఎలాంటి లింక్‌ డాక్యుమెంట్లు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చని.. వివాదరహిత ఆస్తిగా మార్చి డాక్యుమెంట్లు ఇస్తున్నామన్నారు. 

‘దేవుడి దయతో మరో మంచి పనికి శ్రీకారం చుడుతున్నందుకు ఆనందంగా ఉంది. సొంతింటి కలను నిజం చేస్తూ సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నాం. ఒక ఇంటికి అద్దె చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండే హక్కు మాత్రమే ఉంటుంది. అదే సొంతిల్లు అయితే ఎప్పుడైనా కష్టం వస్తే అమ్ముకునే హక్కు ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు అమ్ముకోవడానికి, తనఖా పెట్టుకోవడానికి, వారసుల పేర రాయడానికి ఎలాంటి హక్కు లేదు. బ్యాంకుల్లో రుణం తీసుకోవడానికీ అవకాశం లేదు. అటువంటి పరిస్థితిని మారుస్తూ పూర్తి హక్కులతో ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వబోతున్నాం. గతంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కరించి వివాదరహితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలగాలని.. అందుకే దీన్ని ఈ ఏడాది ఉగాది వరకు పొడిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు. పేదలకు మంచి జరుగుతుంటే కడుపు మంట ఎందుకు? పేదల కోసం ఇంత మంచి పనిచేస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ అన్నారు. 2014 నుంచి 2019 వరకూ వడ్డీ మాఫీ చేయాలని కోరితే చేయని పెద్ద మనుషులు ఈరోజు విమర్శించడం సిగ్గుచేటని ఆక్షేపించారు. పేదవాడికి మంచి జరుగుతుందంటే జీర్ణించుకోలేని కడుపుమంట వీళ్లందరికీ ఎందుకని వ్యాఖ్యానించారు. ఈ 30నెలల కాలంలో బటన్‌ నొక్కి ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా రూ.లక్షా 16వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేశామన్నారు. అవినీతి రహితంగా ఈ నగదును బదిలీ చేశామని సీఎం చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ రిజిస్ట్రేషన్‌ పత్రాలను జగన్‌ అందజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us