ముందుగా పలకరించనున్న నైరుతి

UPDATED 15TH MAY 2017 MONDAY 10:00 AM

REDBEENEWS : నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికంటే ముందుగానే తలుపు తట్టాయి. అవి ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల వద్దకు చేరాయి. మూడురోజుల ముందుగానే దక్షిణ అండమాన్‌లో సముద్రంపై విస్తరించాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ తెలిపారు. వాతావరణశాఖ అంచనాలను అధిగమిస్తూ రుతుపవనాలు ముందస్తుగా అండమాన్ నికోబార్ దీవుల వద్దకు చేరాయని వివరించారు. అయితే షెడ్యూలు కంటే ముందుగానే కేరళ తీరాన్ని దాటుతాయా, లేదా అనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని వివరించారు. సాధారణంగా జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటుతాయని, అప్పటి నుంచి దేశంలో వర్షాకాల సీజన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సాధారణ అంచనా ప్రకారం మే 17వ తేదీ నాటికి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరుతాయి. జూన్ 1వ తేదీకి ఒకటి రెండు రోజులు అటూఇటుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటుతాయని ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ ముఖ్య అధికారి మహేశ్ పలావత్ పేర్కొన్నారు. రానున్న 72 గంటల్లో బంగాళాఖాతంలోని తూర్పు-మధ్య, నైరుతి ప్రాంతాలతోపాటు అండమాన్ సముద్రం మొత్తం విస్తరిస్తాయని వివరించారు. రానున్న 24 గంటల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం గంటకు 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న రుతుపవనాలు, రానున్న రెండు మూడు రోజుల్లో గంటకు 50 కి.మీ వేగాన్ని అందుకుంటాయని పేర్కొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us