రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

UPDATED 26th DECEMBER 2018 WEDNESDAY 6:00 PM

రంగంపేట: రైతుల సంక్షేమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రశక్తి లేదని, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల ప్రధాన కేంద్రంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మే ధాన్యానికి 48 గంటలలో నగదును వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు సరఫరా చేసి తద్వారా నాణ్యమైన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు అందిస్తున్నామని, దీనివల్ల రాష్ట్రంలో ఒక కోటి 47 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో మినుములు ఈ నెలాఖరు వరకు కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలిపారని, దీనిని జనవరి 10వ తేదీ వరకు పొడిగించాలని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గత సంవత్సరం ఏడు క్వింటాళ్ళు మినుములు కొనుగోలు కేంద్రాల్లో తీసుకునేవారని, ఈ సంవత్సరం కేవలం నాలుగు క్వింటాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని, గత సంవత్సరంలా ఏడు క్వింటాళ్ళు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాగే పెతాయ్ తుఫాను వల్ల నష్టపోయిన శెనగ పంటకు కూడ ఇన్ పుట్ సబ్సిడీ ఇప్పించాలని రైతులు మంత్రిని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయ మంత్రితో సంప్రదించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మినుముల తేమ శాతాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, సివిల్ సప్లైస్ డిఎం జయరామ్, మార్క్ ఫెడ్ డిఎం శ్రీమంజు, తహసీల్దార్ ఎం. కృష్ణమూర్తి, ఎంపిడిఓ కిషోర్, ఏఎస్ఓ పురుషోత్తమకుమార్, రైతులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us