UPDATED 26th MAY 2018 SATURDAY 9:30 PM
సామర్లకోట: రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట పట్టణ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల అయినందున స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో అవగాహనా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు మాట్లాడుతూ ప్రతీ పోలింగు స్టేషన్ పరిధిలో బూత్ లెవెల్ అధికారులు 1-1-2019 నాటికి 18 సంవత్సరములు వయస్సు పూర్తి అవబోయే వారిని, 01-01-2018 నాటికి 18 సంవత్సరములు వయస్సు నిండి నమోదు చేయించుకోని వారిని ఓటరుగా నమోదు చేయాలని, ఒకటి కంటే ఎక్కువ పేరు నమోదు అయినవారిని తొలగించాలన్నారు. మరణించిన ఓటర్లను, వేరే ప్రదేశానికి శాశ్వతముగా తరలి వెళ్ళిన ఓటర్లను తొలగించాలన్నారు. ఒక పోలింగు స్టేషన్ నుంచి వేరొక పోలింగు స్టేషన్ లో పేరు మార్చుకోవడానికి, ఓటర్ల జాబితాలోని వ్యక్తుల అడ్రస్, పేరు, ఇతర వివరాలు సవరణ కొరకు, ఓటర్ల జాబితాలో వికలాంగులు ఎవరైనా ఉన్నచో వారిని వికలాంగులుగా గుర్తించాలని, ఈ నెల 21నుంచి జూన్ 30 వరకు వివరములు సేకరించాలన్నారు. దరఖాస్తుదారులు ఓటరుగా నమోదుకు ఆన్ లైన్లో ero.net, జాతీయస్థాయిలో ప్రారంభించిన nvsp.in వెబ్ సైట్లు ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సామర్లకోట మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.







