అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. పార్టీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... స్టీ్‌ల్ ప్లాంట్ విషయంలో వైకాపా తీరును ఎండగట్టారు. ‘‘సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడే జనసేన గుర్తొస్తుంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలని కోరుకుంటున్నా. ఏ ప్రతిఫలం ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకు ప్రేరణ. పనిచేసే క్రమంలో పదవి రావాలి.. పదవి కోసం పనిచేయొద్దు. అందుకే ఈరోజు గాజువాకలో ఓడిపోయినా, ఉత్తరాంధ్రలో గెలవలేకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ఎందుకు నిలబడి ఉన్నామంటే ప్రజాక్షేమం కోరుకున్న వాళ్లం. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్నామని చెప్పడం కోసమే. వైకాపా నేతలు జనసేనకు శత్రువులు కాదు. వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకం. అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని అమిత్ షా నాతో అన్నారు. ప్రధాని మోదీతో గొడవ పెట్టుకోవాలని వైకాపా నేతలు అంటున్నారు. విలువలు లేని వైకాపాకు రాజ్యాంగం విలువ తెలియదు. నాకు ప్రజా బలం ఉంది.. కానీ చట్టసభల్లో లేదు. వైకాపాకు 22 మంది ఎంపీలు ఉన్నారు. చేతగాని వాళ్లు చట్టసభలో ఎందుకు?. వైకాపా ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకుంటామని పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకునే దమ్ముందా? జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరూ ఏకం కావాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ కాపాడతామని చెబుతున్నారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఊసెత్తరు. అందరూ కలిసి వైకాపా నేతలను చొక్కా పట్టుకుని నిలదీయక పోతే వాళ్లు మాట వినరు. జనసేనకు మద్దతిస్తే నేను చేసి చూపిస్తా. 2024 ఎన్నికల వరకు వైకాపా గూండాయిజం, బూతులు భరించాల్సిందే. ఆలోచించి ఓటు వేయకపోతే, విలువ తెలియకుండా అమ్ముకుంటే ప్రజల స్వయంకృతాపరాధమే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు







