వాషింగ్టన్ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కొవిడ్-19 నుంచి రక్షణ పొందేందుకు ఉద్దేశించిన ఎన్-95 మాస్కుల ధరలు ఒకింత ఎక్కువగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేసే అవకాశం లేకపోవడం వల్ల నిర్దిష్ట సమయం పాటు వాటిని వాడి, పారేయాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని దూరం చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిలో ఎన్-95 మాస్కులను ఏకంగా 25 సార్లు శుభ్రం చేసి, తిరిగివాడొచ్చు. ఈ క్రమంలో వాటి రక్షణ సామర్థ్యం ఏ మాత్రం తగ్గదు. ఎన్-95 మాస్కులను సాధారణంగా ఆసుపత్రుల్లో ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో అనేక దేశాల్లో వీటికి కొరత ఏర్పడింది. దీంతో వైద్య సిబ్బంది వాటిని తిరిగి వాడటం లేదా తక్కువ రక్షణ సామర్థ్యమున్న ఇతర మాస్కులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బెథ్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు వేపరైజ్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ (వీహెచ్ పీ)ను తెరపైకి తెచ్చారు. ఇది సాధారణం క్రిమినాశక రసాయనం. దీని సాయంతో ఎన్-95 మాస్కులను శుద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విధానంలో పాతికసార్లు శుద్ధి చేసినా మాస్కు పటిష్ఠత, సమర్థత ఏ మాత్రం తగ్గలేదని వెల్లడైంది. దాని సీళ్లు చెక్కుచెదరలేదని తేలింది.







