అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. దశల వారీగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం సీఎస్ సమీర్‌శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని.. తానే స్వయంగా పర్యవేక్షిస్తాని బుగ్గన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయని, వారిని విరమించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నట్లు తెలిపారు. డిమాండ్లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్‌సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.







