కాండ్రకోట (పెద్దాపురం) : భక్తులకు కొంగుబంగారమైన కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవస్ధానంలో ఘనంగా పూజాఘటం అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.వి. పల్లంరాజు, ఆలయ ఛైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మీ, మార్కెట్‌కమిటి వైస్‌ఛైర్మన్ ఎలిశెట్టి నాని ఆధ్వర్యంలో పూజాఘటాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పూజాఘటాలను జాతరకు ముందు ఏర్పాటుచేస్తామని ఈ.ఓ. పల్లంరాజు తెలిపారు. ఈ నెల 27న అమ్మవారి జాతరమహోత్సవాలను పురస్కరించుకుని ముందుగా పూజాఘటాలను ప్రత్యేక అలంకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజులు ముందుగా ప్రారంభమయ్యే జాతర మహోత్సవాలకు సంబంధించి నిత్యం పలు పూజా కార్యక్రమాలతో పాటు వివిధ అలంకరణలతో గరగల సంబరం నిర్వహించడం జరుగుతుందని ఈ.ఓ. పేర్కొన్నారు. అమ్మవారి ప్రతిరూపమైన పూజా ఘటాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సర్పంచ్ కుంచె గాంధి, ఉపసర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.







